📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeతెలంగాణరైతుల పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు మానుకోవాలి.. ప్రతి గింజా జొన్న ను కొనుగోలు చేస్తాం :...

రైతుల పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు మానుకోవాలి.. ప్రతి గింజా జొన్న ను కొనుగోలు చేస్తాం : కాంగ్రెస్ నేతలు

రామాయంపేట లో జొన్న రైతుల పేరుతో బీఆర్ఎస్ కపట రాజకీయం : మున్సిపల్ ఛైర్పర్సన్ గాజవాడ లావణ్య నాగరాజు.

ఉనికి కోసం రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం.

దళారీల దోపిడీకి అడ్డుకట్ట వేయడానికే కొనుగోలు కేంద్రాలు.

రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ కుట్ర : కాంగ్రెస్

రామాయంపేటలో తొలిసారిగా జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను రైతులు నమ్మవద్దు: కాంగ్రెస్ నాయకులు

 

రామాయంపేట, జూలై 2 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) : రామాయంపేటలో జొన్నల కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుండటాన్ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిపక్షాల విమర్శలను తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్ మున్సిపల్ ఛైర్పర్సన్ మాట్లాడుతూ, “రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండించిన జొన్నలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయని నాయకులు ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చూపించడం హాస్యాస్పదంగా ఉంది” అని విమర్శించారు.”మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించడంతో రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి రైతులను అడ్డం పెట్టుకుని కలెక్టరేట్ వద్ద ధర్నాలు, నిరసనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడం వారి లక్ష్యం కాదు.. రాజకీయ మైలేజీ పొందడమే అసలు ఉద్దేశం” అని ఆరోపించారు.

జొన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు చేస్తుంటే కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. “రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. రైతులను రెచ్చగొట్టి రాజకీయ లాభం

పొందాలనుకోవడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు.

గతంలో రైతులు తమ జొన్నలను అమ్ముకునేందుకు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక చొరవతో రామాయంపేటలోనే జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఊర్లోనే పంట విక్రయించే అవకాశం కల్పించిందన్నారు.

కాట్రియాల్, పర్వతాపూర్, జమ్లా తండా, కిషన్ తండా, దంతేపల్లి తదితర గ్రామాల రైతులు ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. గతంలో రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి రవాణా ఖర్చులు భరించాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఆ భారం పూర్తిగా తగ్గిందన్నారు.మార్క్‌ఫెడ్ నిబంధనల ప్రకారం కొనుగోళ్లు పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కొన్ని జొన్నల్లో తేమ శాతం, మట్టి బెడ్డలు ఉండటంతో నాణ్యత పరిశీలనలో స్వల్ప జాప్యం ఏర్పడిందని, రైతులకు నష్టం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.

మున్సిపల్ చైర్మన్ గజవాడ నాగరాజు మాట్లాడుతూ, “రైతుల కష్టాలను రాజకీయ లబ్ధికి వాడుకోవడం మానుకోవాలి. నిజంగా రైతులపై ప్రేమ ఉంటే కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి వారికి సహాయం చేయాలి. అసత్య ప్రచారాలతో రైతుల్లో గందరగోళం సృష్టించడం మానుకోవాలి” అని అన్నారు.

బండారు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. “గత ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు రైతుల కోసం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. అవసరమైతే కొనుగోలు గడువును కూడా పొడిగించి ఒక్క రైతుకూ నష్టం జరగకుండా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చర్యలు తీసుకున్నారు” అని తెలిపారు.

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి మాట్లాడుతూ, “రామాయంపేట చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను రైతులు నమ్మవద్దు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది” అని స్పష్టం చేశారు.చివరగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, రైతుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లో మున్సిపల్ ఛైర్పర్సన్ గాజవాడ లావణ్య నాగరాజు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారు మహేందర్ రెడ్డి, దేమే యాదగిరి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్, మామిడి సిద్ధరాములు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ రమేష్ రెడ్డి ,వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!