📄 ePaper
Thursday, September 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆస్ట్రేలియా : సోషల్‌ మీడియా ఫీడ్‌పై ఇక యూజర్‌దే అధికారం!

ఆస్ట్రేలియా : సోషల్‌ మీడియా ఫీడ్‌పై ఇక యూజర్‌దే అధికారం!

ఆల్గారిథమ్‌ ఏది చూపించాలో నిర్ణయించదు.. నచ్చిన కంటెంట్‌నే చూసే అవకాశం కల్పించేందుకు ఆస్ట్రేలియా కొత్త నిబంధనలు

సిడ్నీ, సెప్టెంబర్‌ 8 (నవజ్యోతి డెస్క్‌):

సోషల్‌ మీడియా వినియోగంలో మరో కీలక మార్పుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వేదికల్లో ఆల్గారిథమ్‌ ఆధారంగా వచ్చే కంటెంట్‌ను చూడాలా? వద్దా? అనే నిర్ణయాన్ని ఇక వినియోగదారులకే ఇవ్వాలని ప్రతిపాదించింది.

‘నా ఫీడ్‌.. నా ఇష్టం’!

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌ ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా చట్టాల ప్రకారం సోషల్‌ మీడియా సంస్థలు తమ వినియోగదారులకు డిఫాల్ట్‌ ఫీడ్‌ ఎలా పనిచేస్తుందో తెలియజేయాలి.

వినియోగదారులకు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి.. ఆల్గారిథమ్‌ సూచించే వ్యక్తిగత కంటెంట్‌ను కొనసాగించడం. రెండోది.. ఆ సిఫార్సులను నిలిపివేసి, తాము ఎంచుకుని ఫాలో అయ్యే స్నేహితులు, సృష్టికర్తల పోస్టులను మాత్రమే చూడటం.

వినియోగదారుడి ఎంపికకు ప్రాధాన్యం

సోషల్‌ మీడియా ఆల్గారిథమ్‌లు ఒకసారి వినియోగదారుడు చూసిన కంటెంట్‌కు దగ్గరగా ఉన్న మరిన్ని పోస్టులను వరుసగా చూపిస్తూ ఎక్కువసేపు ప్లాట్‌ఫామ్‌లోనే ఉండేలా చేస్తున్నాయన్న విమర్శలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి.

దీనివల్ల వ్యసనాత్మక వినియోగం పెరుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం వినియోగదారులకు కంటెంట్‌ ఎంపికపై మరింత నియంత్రణ ఇవ్వాలని భావిస్తోంది.

యూరప్‌ బాటలో ఆస్ట్రేలియా

యూరోపియన్‌ యూనియన్‌లోని డిజిటల్‌ సర్వీసెస్‌ చట్టం ఇప్పటికే వినియోగదారులకు ప్రొఫైలింగ్‌ను నిలిపివేసే అవకాశం కల్పిస్తోంది. అయితే వినియోగదారులకు ఆ ఆప్షన్‌ సులభంగా కనిపించకుండా ప్లాట్‌ఫామ్‌లు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు అక్కడి నియంత్రణ సంస్థల నుంచి వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రతిపాదనలో వినియోగదారులకు ఎంపిక ఉండటమే కాకుండా.. ఆ ఎంపికను సులభంగా, స్పష్టంగా అందించాల్సిన బాధ్యతను సోషల్‌ మీడియా సంస్థలపై పెట్టాలని చూస్తోంది.

నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానా

కొత్త నిబంధనలను పాటించని డిజిటల్‌ వేదికలకు గరిష్ఠంగా 109.2 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.460 కోట్లకు పైమాటే.

నిబంధనల అమలు, పర్యవేక్షణ బాధ్యత ఆస్ట్రేలియా ఇంటర్నెట్‌ నియంత్రణ సంస్థ eSafetyకు అప్పగించనున్నారు.

హానికర కంటెంట్‌పై కూడా చర్యలు

హానికరమైన, నగ్నత్వానికి సంబంధించిన, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను త్వరగా తొలగించాలని పెద్ద టెక్‌ సంస్థలకు నోటీసులు జారీ చేసే అధికారం కూడా eSafetyకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.

అయితే ఈ అధికారాల వల్ల స్వేచ్ఛా భావ ప్రకటనపై ఆంక్షలు, సెన్సార్‌షిప్‌ పెరిగే ప్రమాదం ఉందని ఫ్రీ స్పీచ్‌ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

“ప్రభుత్వ నియంత్రణ కాదు.. ప్రజల నియంత్రణ”

విమర్శలకు స్పందించిన ప్రధాని అల్బనీస్‌.. ఈ ప్రతిపాదన ప్రభుత్వం సోషల్‌ మీడియాను నియంత్రించేందుకు కాదని, వినియోగదారులకు తమ ఫీడ్‌పై నియంత్రణ ఇచ్చేందుకేనని స్పష్టం చేశారు.

డిజిటల్‌ వేదికలు ఆస్ట్రేలియా వినియోగదారులకు ఎదురయ్యే హానిని గుర్తించిన తర్వాత తీసుకున్న చర్యలను నమోదు చేయడంతో పాటు, అవి కాలక్రమంలో పనిచేస్తున్నాయా లేదా అన్నదానినీ నిర్ధారించాల్సి ఉంటుంది.

ఇంకా ముసాయిదా దశలోనే

ప్రభుత్వం ప్రస్తుతం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు, పరిశ్రమ సంఘాలు, పౌర సమాజ సంస్థలు, వినియోగదారుల హక్కుల కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. అనంతరం ఈ ఏడాదిలోనే ముసాయిదా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

సోషల్‌ మీడియా భవిష్యత్తుపై కొత్త చర్చ

ఇంతకాలం వినియోగదారుడు ఏం చూడాలో ఎక్కువగా ఆల్గారిథమ్‌ నిర్ణయించే విధానం కొనసాగింది. ఇప్పుడు “ఏది చూడాలి?” అనే నిర్ణయంలో వినియోగదారుడికే తుది మాట ఉండాలన్న దిశగా ఆస్ట్రేలియా అడుగులు వేస్తోంది. ఇది అమల్లోకి వస్తే సోషల్‌ మీడియా సంస్థల వ్యాపార నమూనాలు, వ్యక్తిగత సిఫార్సులు, ఆన్‌లైన్‌ భద్రతపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది.

— నవజ్యోతి డెస్క్‌
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!