📄 ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సైబర్‌ మోసాలకు నాగార్జున కూడా బాధితుడే!

సైబర్‌ మోసాలకు నాగార్జున కూడా బాధితుడే!

బ్యాంకు అధికారినంటూ ఫోన్‌.. పెట్టుబడి పేరుతో వల

‘సురక్షా కా తిరంగా’లో తన అనుభవాన్ని వెల్లడించిన నటుడు

హైదరాబాద్‌, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి): సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమంలో సినీ నటుడు నాగార్జున పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని TGiCCC ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి డీజీపీ సీవీ ఆనంద్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న SPARK క్లబ్‌ విద్యార్థులు, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

నాగార్జునకూ తప్పని సైబర్‌ మోసం

నాలుగేళ్ల క్రితం తాను కూడా సైబర్‌ మోసానికి గురైనట్లు నాగార్జున తెలిపారు. బ్యాంకు అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేసి.. తన పేరు, వ్యాపార వ్యవహారాలను ప్రస్తావిస్తూ నమ్మకం కలిగించాడన్నారు. అనంతరం అధిక రాబడి వస్తుందని చెబుతూ ఓ పెట్టుబడి పథకంలో డబ్బులు పెట్టాలని సూచించినట్లు వివరించారు.

తన ఆర్థిక వ్యవహారాలను సాధారణంగా మేనేజర్‌ చూసుకుంటారని, నేరుగా బ్యాంకు అధికారినంటూ ఫోన్‌ రావడంతో తొలుత తాను కూడా నిజమేనని నమ్మినట్లు నాగార్జున తెలిపారు. ఈ ఘటన ద్వారా ఎంత పరిచయం ఉన్న వ్యక్తిలా మాట్లాడినా.. ఆన్‌లైన్‌లో వచ్చే పెట్టుబడి ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బంధువుకూ పోలీసుల పేరుతో ఫోన్‌

తన బంధువుకు ఎదురైన మరో సైబర్‌ మోసం గురించి కూడా నాగార్జున వెల్లడించారు. సినిమా షూటింగ్‌ కోసం ఇరాన్‌ వెళ్లిన ఆమె విమానాశ్రయంలో దిగగానే కొందరు ఫోన్‌ చేసి తాము పోలీసులమని పరిచయం చేసుకున్నారని తెలిపారు.

ఆమె బ్యాగులో మాదకద్రవ్యాలు ఉన్నాయని భయపెట్టి.. గదిలోనే ఉండి వీడియో కాల్‌లో మాట్లాడాలని ఆదేశించినట్లు చెప్పారు. అయితే సైబర్‌ మోసాలపై అవగాహన ఉండటంతో ఆమె వెంటనే పోలీసులను సంప్రదించి ప్రమాదం నుంచి బయటపడిందన్నారు.

కనిపించరు.. కానీ ప్రమాదం ఎక్కువ

సైబర్‌ నేరాలు రాబోయే రోజుల్లో పోలీసులకు మరింత పెద్ద సవాలుగా మారనున్నాయని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. సైబర్‌ నేరాలతో పాటు మాదకద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు.

ముఖ్యంగా రిటైర్డ్‌ ఉద్యోగులు, వృద్ధులు సైబర్‌ నేరగాళ్లకు లక్ష్యంగా మారుతున్నారని.. వారిలో ప్రత్యేకంగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పెట్టుబడి మోసాలతో పాటు కొత్త తరహా సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని, నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారని అధికారులు తెలిపారు.

భయపడకుండా ఫిర్యాదు చేయాలి

సైబర్‌ మోసానికి గురైన వారు పరువు, సామాజిక భయం కారణంగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండొద్దని అధికారులు సూచించారు. ఘటన జరిగిన వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందిస్తే నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు.

‘అప్రమత్తంగా ఉండండి.. అవగాహన పెంచుకోండి.. సైబర్‌ సురక్షితంగా ఉండండి’ అనే సందేశంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!