శ్రీ నల్లపోచమ్మ తల్లికి ఘనంగా బోనాల సమర్పణ
వెల్దుర్తి, సెప్టెంబర్ 11 (నవజ్యోతి ప్రతినిధి ముకుంద్):
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో శ్రీ నల్లపోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు.
మహిళలు సంప్రదాయబద్ధంగా తలపై బోనాలు ఎత్తుకొని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి ఆలయం వరకు ఊరేగింపుగా తరలివచ్చారు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాలు, తొట్టెల ఊరేగింపు, కోలాటాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు నల్లపోచమ్మ తల్లికి జై అంటూ నినాదాలు చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోవాకు తరుణ్, రాష్ట్ర ఎన్ఎస్యూఐ నాయకులు హరీష్ వర్ధన్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ సుభిక్షం, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారికి బోనాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మండల యూత్ ఉపాధ్యక్షుడు పిట్ల శరత్, మెల్లూరు సర్పంచ్ రంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్, ఉపాధ్యక్షుడు చక్రవర్తి, మండల యూత్ అధ్యక్షుడు ప్రేమ్‌దాస్, ఎన్ఎస్యూఐ నాయకులు రవితేజ, కౌడే నవీన్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

