హయత్‌నగర్ సాహెబ్‌నగర్ ఆఫీసర్స్ కాలనీలో 400 గజాల ప్రజా స్థలం పరిరక్షణ కోసం రెండేళ్లుగా స్థానికులు చేస్తున్న పోరాటానికి హైడ్రా అండగా నిలిచింది. ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
400 గజాల స్థలం.. రెండేళ్ల పోరాటం
1987లో రూపొందించిన లేఅవుట్లో ప్లాట్ నంబర్లు 39, 40లను ప్రజా సౌకర్యాల కోసం కేటాయించినట్లు స్థానికులు చెబుతున్నారు. మొత్తం 400 గజాల ఈ స్థలాన్ని పార్కు, ఇతర ప్రజా అవసరాల కోసం ఉపయోగించాల్సి ఉండగా.. ప్రైవేటు నిర్మాణాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రెండేళ్లుగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వివాదం ఎలా మొదలైంది?
లేఅవుట్‌ను నిర్వహిస్తున్న సొసైటీ 45 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహించకపోవడంతో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అధికారి దానిని రద్దు చేసినట్లు హైడ్రాకు సమాచారం అందింది.
అనుమతి G+1.. నిర్మాణం నాలుగు అంతస్తులా?
ప్రస్తుత నిర్మాణదారులు G+1 భవనానికి అనుమతి పొందినప్పటికీ.. అనుమతులకు విరుద్ధంగా నాలుగు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థల యాజమాన్యంపై వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే నిర్మాణం కొనసాగించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా స్థలాల విషయంలో రాజీ లేదు
కాలనీకి చెందిన పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు ప్లకార్డులతో హైడ్రా కమిషనర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. ప్రజా స్థలాలు, పార్కులు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని రంగనాథ్ స్పష్టం చేశారు.
కోర్టుకు పూర్తి నివేదిక
స్థలానికి సంబంధించిన రికార్డులు, హక్కులు, భవన అనుమతులు, నిర్మాణ ఉల్లంఘనల వివరాలను సేకరించి కోర్టు ముందుంచనున్నట్లు హైడ్రా తెలిపింది. అక్కడ జరిగిన అనధికార నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఇప్పుడు హైడ్రా ఎంట్రీ..ప్రజా స్థలం విషయంలో ‘హిస్టరీ రిపీట్’ అవుతుందా?
ప్రజా స్థలాల పరిరక్షణలో మరోసారి యాక్షన్ మొదలైంది.

