కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర సీనియర్ నాయకులు కలిసి ఛార్జ్‌షీట్‌ను విడుదల చేశారు.
‘వంద రోజుల్లో స్వర్గం.. వెయ్యి రోజుల్లో నరకం’
వంద రోజుల్లో స్వర్గం చూపిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో నరకం చూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇది ప్రజా పాలన కాదని.. ప్రజా పీడన పాలన అని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలపై దరిద్రం దండయాత్ర చేసి వెయ్యి రోజులు పూర్తయిందన్నారు.
‘నేలపూరిత వృధా.. సర్వ భ్రష్టపాలన’
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన ‘నేలపూరిత వృధా’ అని కేటీఆర్ అభివర్ణించారు. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ఇది ‘సర్వ భ్రష్టపాలన’ అని అన్నారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని మండిపడ్డారు.
‘అసమర్థత ప్రో మ్యాక్స్.. అవినీతి అల్ట్రా మ్యాక్స్’
స్వయంగా సెక్రటేరియట్లో ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాకు దిగడమే ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ ముందు మోకరిల్లిన ఢిల్లీ పాలన సాగుతోందని, రాష్ట్రంలో తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్న జలగల పాలన కొనసాగుతోందని విమర్శించారు.
ఈ ప్రభుత్వం ‘అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐమ్యాక్స్’లా తయారైందని కేటీఆర్ ఆరోపించారు.
భూములపై ముఖ్యమంత్రి, మంత్రులపై ఆరోపణలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భూములు కొల్లగొడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు పరస్పరం కొట్లాడుకుంటూ రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరిలా మార్చారని ధ్వజమెత్తారు.
ఆరు గ్యారెంటీలపై హరీశ్‌రావు ఫైర్
మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి, వెయ్యి రోజులు పూర్తయినా వాటి అమలుపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో ఎంతో అద్భుతంగా ఉన్న విద్య, వైద్యం, విద్యుత్, తాగు-సాగునీరు, శాంతిభద్రతల రంగాలు కాంగ్రెస్ పాలనలో పూర్తిగా కుప్పకూలిపోయాయని హరీశ్‌రావు ఆరోపించారు.
రైతులు, మహిళలు, యువత సమస్యల ప్రస్తావన
కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, పేదలు, సామాన్య ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. రైతులకు ఎకరాకు రూ.15 వేల సాయం, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల సాయం, రూ.2 లక్షల రుణమాఫీ, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల హామీ వంటి అంశాలను ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది.
విద్య, మహిళల హామీలపైనా ఆరోపణలు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.12 వేల కోట్లకు పైగా ఉన్నాయని, గురుకుల వ్యవస్థ బలహీనపడిందని బీఆర్ఎస్ ఆరోపించింది. మహిళలకు రూ.2,500, గ్యాస్ సబ్సిడీ, మహిళా విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటి హామీలను కూడా అమలు చేయలేదని పేర్కొంది.
‘కుంభకోణాల కుంభమేళా’
తెలంగాణలో కుంభకోణాల కుంభమేళా నడుస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి కుటుంబం అవినీతిని మింగి కూతురే చెబుతోందని వ్యాఖ్యానించారు. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏడాదిలో రూ.450 కోట్ల అప్పు తీర్చారని, ఓ ఎమ్మెల్యేనే అంత సంపాదిస్తే సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ ఇంకెంత సంపాదిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ ఆరోపించారు.
‘కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు’
‘కేసీఆర్ రాజీనామా చేస్తే రాష్ట్రమే వచ్చింది. మళ్లీ రాజీనామా చేస్తే సీఎంకు తట్టుకునే శక్తి ఉందా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ తప్పకుండా అసెంబ్లీకి వస్తారని స్పష్టం చేశారు.
‘జెన్-జీతో పెట్టుకుంటే మోదీకే చెమటలు’
జెన్-జీతో పెట్టుకుంటే ప్రధాని మోదీకే చెమటలు పట్టాయని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి లాంటి కేడీ ఎంత అని వ్యాఖ్యానించారు.
ఏడు రోజుల పోరుబాట
1000 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఏడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆరు గ్యారెంటీలు, ఎన్నికల హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ సమరభేరి
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. హామీల అమలు, ప్రజా సమస్యలు, పాలనా వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఏడు రోజుల పోరుబాటను ప్రారంభించింది.

