📄 ePaper
Wednesday, August 26, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్ కంపెనీలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆహ్వానం

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. జపాన్ కంపెనీలకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆహ్వానం

తెలంగాణలో పెట్టుబడులు సురక్షితంగా, లాభదాయకంగా ఉండేలా సహకరిస్తాం

హైదరాబాద్‌, ఆగస్టు 25 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ముందుకు రావాలని శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. జపాన్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే అవసరమైన సహకారం, మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. పెట్టుబడులు సురక్షితంగా, లాభదాయకంగా ఉండేలా అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.

జపాన్ కంపెనీలకు విస్తృత అవకాశాలు

ఒసాకాలో Career Consultz వ్యవస్థాపకుడు, CEO రోహిత్ రావు నిర్వహించిన ‘Leveraging Indian Talent’ ఇండియా–జపాన్ వర్క్‌ఫోర్స్ రౌండ్‌టేబుల్‌లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జపాన్ వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, ప్రభుత్వ, విద్యా సంస్థల ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడులు, నైపుణ్య మానవ వనరులు, ఉపాధి అవకాశాలు, టాలెంట్ మొబిలిటీపై చర్చించారు.

ఐటీ, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో తెలంగాణకు బలమైన టాలెంట్ పూల్ ఉందని మంత్రి తెలిపారు. జపాన్ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరించడంతో పాటు కొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కోరారు. పెట్టుబడులకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు, ప్రభుత్వ సహకారం అందిస్తూ వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు.

600 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్‌పై ఆసక్తి

తెలంగాణలో సుమారు 600 ఎకరాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు జపాన్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఇది తెలంగాణపై జపాన్ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో మరిన్ని జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.

తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు

పెట్టుబడులతో పాటు తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అక్కడి సంస్థలతో కలిసి పనిచేయాలని ప్రభుత్వం భావిస్తోందని వివేక్ వెంకటస్వామి తెలిపారు. జపాన్‌లో పెరుగుతున్న నైపుణ్య మానవ వనరుల అవసరాలను తెలంగాణ టాలెంట్‌తో అనుసంధానం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.

తెలంగాణ యువత కొత్త దేశాలు, వాతావరణాలకు త్వరగా అలవాటు పడటంతో పాటు కష్టపడి పనిచేయడం, కొత్త విషయాలను వేగంగా నేర్చుకోవడం, పని సంస్కృతికి అనుగుణంగా మారడం వంటి లక్షణాలు కలిగి ఉంటారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 120 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.

భాష, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం

విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే యువతకు ఆయా దేశాల భాషపై పరిజ్ఞానం కీలకమని మంత్రి అన్నారు. టామ్‌కామ్ ద్వారా నైపుణ్య శిక్షణతో పాటు భాషా శిక్షణ, ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు, పని సంస్కృతిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ యువత అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌లో ఉపాధి పొందేలా సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జర్మనీతో నైపుణ్య మానవ వనరుల రంగంలో భాగస్వామ్యం ఏర్పరుచుకుందని మంత్రి తెలిపారు. ఇటీవల జర్మనీ బృందం తెలంగాణలో పర్యటించిన సందర్భంగా అవగాహన ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. తెలంగాణ చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను జర్మనీ ప్రతినిధులు ప్రశంసించారని పేర్కొన్నారు.

జపాన్‌తో మరింత బలమైన వర్క్‌ఫోర్స్ భాగస్వామ్యం

నైపుణ్య మానవ వనరుల నియామకం, శిక్షణ, ఉపాధి కల్పనలో జపాన్ సంస్థలతో మరింత బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలిపారు. భారత్–జపాన్ సంబంధాల్లో వర్క్‌ఫోర్స్ మొబిలిటీ కీలక అంశంగా మారుతోందన్నారు. పెట్టుబడులు, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధిలో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రౌండ్‌టేబుల్ దోహదపడుతుందని చెప్పారు.

రైజింగ్ తెలంగాణకు జపాన్ కంపెనీలను ఆహ్వానించిన హరిచందన

శక్తి శాఖ కార్యదర్శి హరిచందన మాట్లాడుతూ TOMCOM ద్వారా రాష్ట్ర యువతకు సురక్షితమైన విదేశీ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ వర్క్‌ఫోర్స్ మొబిలిటీలో టామ్‌కామ్‌ను విశ్వసనీయ ప్రభుత్వ భాగస్వామిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. జపాన్ కంపెనీలు TOMCOMతో కలిసి పనిచేసి తెలంగాణ యువతకు మరిన్ని అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

డిసెంబర్ 2026లో నిర్వహించనున్న రైజింగ్ తెలంగాణ సదస్సులో జపాన్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు పాల్గొనాలని హరిచందన ఆహ్వానించారు.

ఐదేళ్లలో 5 లక్షల మంది అవసరం: చంద్రు అప్పర్

ఒసాకా–కోబేలో భారత కాన్సుల్ జనరల్ చంద్రు అప్పర్ మాట్లాడుతూ భారత్–జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో వర్క్‌ఫోర్స్ మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఐదేళ్లలో భారత్–జపాన్‌కు 5 లక్షల మంది మానవ వనరులు అవసరమని, ఇందులో 50 వేల మంది నైపుణ్యవంతులైన సిబ్బంది, ప్రతిభావంతులైన మానవ వనరులు జపాన్‌కు అవసరమవుతారని తెలిపారు. భారత్ నుంచి మరింత మంది నైపుణ్యవంతులైన యువతకు జపాన్‌లో అవకాశాలు కల్పించే దిశగా Career Consultz, TOMCOM చేస్తున్న కార్యక్రమాలకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

భారత్‌లో వైవిధ్యభరితమైన టాలెంట్: రోహిత్ రావు

Career Consultz వ్యవస్థాపకుడు, CEO రోహిత్ రావు మాట్లాడుతూ భారత్‌లో విస్తృతమైన, వైవిధ్యభరితమైన టాలెంట్ ఉందన్నారు. ఐటీ, ఇంజినీరింగ్‌తో పాటు స్కిల్డ్, టెక్నికల్ మ్యాన్‌పవర్‌లోనూ భారీ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జపాన్‌లో ఉపాధి కోసం భారతీయ యువతకు జపనీస్ భాష, సంస్కృతి, ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.

Specified Skilled Worker (SSW) కార్యక్రమం ద్వారా భారతీయ నిపుణులు, నైపుణ్యవంతులైన యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలిపారు. నాగోయా డిప్యూటీ మేయర్ యసుయో ఫుకియాగే కూడా కార్యక్రమంలో పాల్గొని భారత్–జపాన్ సహకారం, నైపుణ్య మానవ వనరుల భాగస్వామ్యంపై అభిప్రాయాలు పంచుకున్నారు.

పాల్గొన్న ఉన్నతాధికారులు, సంస్థల ప్రతినిధులు

తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జపాన్ వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, విశ్వవిద్యాలయాల ప్రతినిధులు, భారత్–జపాన్ సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్–జపాన్ (ICCJ) తరఫున పరమ్‌జిత్ చద్దా, ఇషు కల్వాని, కాన్సాయ్ జపాన్–ఇండియా అసోసియేషన్ (KJIA) తరఫున జునిచి నిషిదా, సుసుము సైటో, NICE తరఫున యసుజి కితామురా, FWC-Japan-IHDA ప్రతినిధులు పాల్గొన్నారు. నాగోయా సిటీ, ఒసాకా ప్రిఫెక్చర్‌కు చెందిన అధికారులు కూడా హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!