స్కూల్ ఎడ్యుకేషన్–టి-శాట్ మధ్య ఎంఓయూ.. 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక డిజిటల్ క్లాసులు
హైదరాబాద్, ఆగస్టు 22 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ విద్యను మరింత చేరువ చేసేందుకు కీలక
ముందడుగు పడింది. స్కూల్ ఎడ్యుకేషన్, టి-శాట్ మధ్య ప్రత్యేక అవగాహన ఒప్పందం
(ఎంఓయూ) కుదిరింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ కంటెంట్‌ను
ఆన్‌లైన్, ప్రసార మాధ్యమాల ద్వారా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఒప్పందం
చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, టి-శాట్ సీఈవో
బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఎంఓయూపై సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను
పరస్పరం మార్చుకున్నారు.
9, 10 తరగతులకు సాయంత్రం డిజిటల్ క్లాసులు
ఈ ఒప్పందంలో భాగంగా 9, 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక
ఆన్‌లైన్ డిజిటల్ క్లాసులు నిర్వహించి టి-శాట్ వేదికగా ప్రసారం చేయనున్నారు.
ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో ఉపయోగపడేలా పాఠ్యాంశాలను
సులభతరంగా అందించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న
విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పాఠశాల విద్యలో
సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించే అవకాశం ఉంది.
‘పేరెంట్స్–టీచర్స్ మీటింగ్’కు టి-శాట్ వేదిక
పాఠశాల విద్యకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను కూడా టి-శాట్ ద్వారా విస్తృతంగా
ప్రసారం చేయనున్నారు. ‘పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్’, ‘మా జిల్లా–మా పాఠశాల’,
తల్లిదండ్రులతో ప్రత్యేక కార్యక్రమాలు వంటి కార్యక్రమాలకు టి-శాట్ వేదికగా
ఉపయోగపడనుంది.
రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
నిర్వహించే ‘ముఖాముఖి’ కార్యక్రమాలతో పాటు జిల్లా స్థాయిలో డీఈవోలు నిర్వహించే
ప్రత్యేక కార్యక్రమాలను కూడా మరింత విస్తృతంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు
చేరువ చేసే అవకాశం కలుగుతుంది.
ఉపాధ్యాయులకు ‘టి.ఎల్.ఎం.’ మేళా
ఉపాధ్యాయులకు ఉపయోగపడే టీచింగ్–లెర్నింగ్ మెటీరియల్ (టి.ఎల్.ఎం.) మేళాతో
పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను కూడా టి-శాట్ వేదికగా ప్రసారం చేయనున్నారు.
బోధనలో కొత్త పద్ధతులు, డిజిటల్ వనరుల వినియోగం, విద్యార్థులకు పాఠ్యాంశాలను
సులభంగా బోధించే విధానాలపై ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడనున్నాయి.
తరగతి గదికి డిజిటల్ టచ్..
ప్రభుత్వ విద్యార్థికి మరిన్ని అవకాశాలు!
టి-శాట్‌తో విద్యా ప్రసారాలకు కొత్త ఊపు
సమగ్ర శిక్ష, ఎస్‌ఈఆర్‌టీకి ప్రత్యేక ఆదేశాలు
డిజిటల్ ప్రసారాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని టి-శాట్ ద్వారా నిర్వహించేలా
సమగ్ర శిక్ష, ఎస్‌ఈఆర్‌టీ తదితర విభాగాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని
డైరెక్టర్ నవీన్ నికోలస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ ఎప్పుడైనా అందుబాటులో ఉండేలా
ప్రసార వ్యవస్థను వినియోగించుకోవడం వల్ల పాఠశాల విద్యలో డిజిటల్ లెర్నింగ్‌కు
మరింత ప్రాధాన్యత లభించనుంది.
విద్యార్థుల ప్రయోజనమే లక్ష్యం
ఎంఓయూ ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం రూపొందించే విద్యా కార్యక్రమాలకు టి-శాట్
ప్రసార వేదికగా ఉపయోగపడనుంది. దీంతో తరగతి గదిలోనే కాకుండా ఇంటి వద్ద కూడా విద్యార్థులు
నాణ్యమైన విద్యా కంటెంట్‌ను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమయ్యే
విద్యార్థులకు సాయంత్రం డిజిటల్ తరగతులు అదనపు సహాయక వేదికగా మారనున్నాయి.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ అడిషనల్ డైరెక్టర్
పీవీ శ్రీహరి, టి-శాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
ఎండీ సాధిక్, జనరల్ మేనేజర్ లింగారెడ్డి,
ప్రాజెక్ట్ జేడీలు, కో-ఆర్డినేటర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

