గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య.. మెరుగైన వసతులు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఉట్నూరు, ఆగస్టు 22 (నవజ్యోతి ప్రతినిధి):
పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ
ప్రధాన లక్ష్యమని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ మారుమూల
గిరిజన ప్రాంతాల విద్యార్థుల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
శనివారం మంత్రి ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్
రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఎస్పీ
అఖిల్ మహాజన్ మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పోలీసుల గౌరవ వందనం
స్వీకరించారు.
ఆశ్రమ పాఠశాలలో కొత్త వసతులకు శ్రీకారం
ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐఎఫ్ ప్యానెల్‌ను మంత్రి రిబ్బన్ కట్ చేసి
ప్రారంభించారు. అనంతరం దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
విద్యార్థినులకు ఏకరూప దుస్తులు, కిట్లను పంపిణీ చేశారు.
పేద, గిరిజన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు
తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో యూనిఫాంలు, షూస్, పుస్తకాలు,
ఇతర అవసరమైన సౌకర్యాలు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా..
ఆశ్రమ, గురుకుల పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం
కృషి చేస్తోందని మంత్రి అన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను
సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరింత అంకితభావంతో పనిచేయాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని,
ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్టీ సిబ్బంది సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
గిరిజన ప్రాంతాల్లో విద్యతో పాటు వైద్యం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలను మరింత బలోపేతం
చేస్తామని స్పష్టం చేశారు.
విద్యతో పాటు ఆరోగ్యంపై దృష్టి
ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, శారీరక దారుఢ్యంపై
ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి తెలిపారు. డిజిటల్ తరగతి గదులు, జూంబా,
ఏరోబిక్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఉన్నత స్థానాలకు ఎదగాలి: ఎమ్మెల్సీ దండే విఠల్
ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ పేద, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులు
ఉన్నత విద్యను అభ్యసించి కలెక్టర్లు, ఇంజనీర్లు, వైద్యులు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత
స్థానాలకు ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్, గిరిజన స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు
శిక్షణ అందిస్తూ అనేక మంది ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికవుతున్నారని తెలిపారు.
ఉన్నత చదువులు, పోటీ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ సదుపాయాలను మరింత విస్తరించేందుకు
ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
పాఠశాలల అభివృద్ధికి సమన్వయం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో
విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని
సూచించారు.
ప్రభుత్వం కల్పిస్తున్న డిజిటల్ బోర్డులు, సైన్స్ ల్యాబ్‌లు, ఇతర ఆధునిక సౌకర్యాలను
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు కూడా
పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు
జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు
నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు
చేపడుతోందన్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఆశ్రమ పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ
(FLN) కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో
ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ,
నెలవారీ సమీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.
విద్యార్థుల పోషకాహార స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఉమ్మడి జిల్లా ఐటీడీఏ
పరిధిలోని 400కుపైగా గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో సుమారు రూ.20 కోట్లతో
మరమ్మతు పనులు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్టీ సిబ్బంది కొరత, అత్యవసర ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యలను
పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉట్నూరు ఐటీడీఏ ఆధ్వర్యంలోని
దివ్యాంగ విద్యార్థుల ‘వికాసం స్కూల్’ను మరింత బలోపేతం చేసేందుకు
సహకారం అందిస్తామని తెలిపారు.
పేదింటి విద్యార్థికి అండగా ప్రభుత్వం..
గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బలమైన బాట!
అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఇతర అధికారులు
విద్యార్థినులకు ఏకరూప దుస్తులు, కిట్లను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి
మంత్రి, అధికారులు సహపంక్తి భోజనం చేశారు.
పాల్గొన్నవారు: ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సంతోష్, ఎస్ఈటిడబ్ల్యూ ఫణికుమారి,
అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఏఎస్పీ రుత్విక్ సాయి కోటే, ఆర్డీఓ మోహన్ సింగ్,
డి. ప్రేమకళ, డీటీడీఓలు అంబాజీ, నిహారిక, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,
సర్పంచ్ అనిత జాదవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,
విద్యార్థులు పాల్గొన్నారు.

