నిజామాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన.. లబ్ధిదారులతో మాట్లాడిన మంత్రి.. అర్ధాంతరంగా ఆగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి అర్హులకు అందించాలని ఆదేశాలు
నిజామాబాద్, ఆగస్టు 22 (నవజ్యోతి ప్రతినిధి):
నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించిన మంత్రి.. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో
నిర్మాణంలో ఉన్న, పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యేలు,
ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారుల ముఖాల్లో కనిపించిన ఆనందం తనకు సంతోషాన్ని, గర్వాన్ని కలిగించిందని
మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద కుటుంబాల జీవితాల్లో తీసుకొస్తున్న
మార్పును ప్రత్యక్షంగా చూడటం గొప్ప అనుభూతిగా అభివర్ణించారు.
పేదింటి కలను నెరవేర్చడం అదృష్టం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను కలిసిన ప్రతిసారీ పేదల చిరకాల సొంతింటి కలను తీర్చే బాధ్యత దక్కడం
తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కానుకలు అందించి
శుభాకాంక్షలు తెలిపారు.
ఇతర పట్టణాల్లోనూ ఇందిరమ్మ టవర్లు
హైదరాబాద్ తరహాలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్లను రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లోనూ
నిర్మించేందుకు నిజామాబాద్ నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇందుకు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని హౌసింగ్ శాఖకు చెందిన ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో రెండు విడతలు, హైదరాబాద్‌లో తొలి విడతతో కలిపి
8 లక్షల ఇళ్లు మంజూరు చేయగా.. 2 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు.
అర్ధాంతరంగా ఆగిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మోక్షం
అనంతరం నిజామాబాద్ పట్టణంలో గత ప్రభుత్వాల హయాంలో నిర్మాణం ప్రారంభించి అర్ధాంతరంగా నిలిచిపోయిన
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని మంత్రి పరిశీలించారు.
నివాసయోగ్యంగా మార్చేందుకు అవసరమైన నిర్మాణాలు, మౌలిక వసతులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేసి వారికి అందించాలని
జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు.
పేదల సొంతింటి కల.. ప్రభుత్వ బాధ్యత!
అర్ధాంతరంగా ఆగిన ఇళ్లకు మళ్లీ కదలిక

