📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా !

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా !

4.21 లక్షల మందికి గ్రూప్‌ ప్రమాద బీమా.. ప్రమాద మరణానికి రూ.5 లక్షల వరకు రక్షణ…

హైదరాబాద్‌, ఆగస్టు 10 (నవజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలోని 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రూప్‌ ప్రమాద బీమా పథకం (GAIS) అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్యకారుల సామాజిక భద్రత, జీవనోపాధి రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

రూ.5 లక్షల వరకు బీమా

18 నుంచి 70 ఏళ్ల వయస్సున్న నమోదిత మత్స్యకారులు ఈ పథకం పరిధిలోకి వస్తారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యానికి రూ.5 లక్షలు, శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షల బీమా పరిహారం అందుతుంది. ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందితే గరిష్ఠంగా రూ.25 వేల వరకు వైద్య సహాయం లభిస్తుంది.

ప్రీమియం ప్రభుత్వాలదే

ఒక్కో మత్స్యకారుడికి రూ.79.96 చొప్పున బీమా ప్రీమియం ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21.34 కోట్లకుపైగా చెల్లించనుంది. దీంతో లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని మంత్రి తెలిపారు.

జూన్‌ 1 నుంచి అమలు

2026 జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే పాలసీ కాలంలో అర్హులైన మత్స్యకారులకు నిరంతర బీమా రక్షణ అందేలా మత్స్యశాఖ చర్యలు చేపట్టిందన్నారు. ప్రమాద సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీహరి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!