13 మంది విద్యార్థులను విమానంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లిన ఏలూరు జెడ్పీ స్కూల్ టీచర్లు..
ఏలూరు, ఆగస్టు 10 (నవజ్యోతి ప్రతినిధి): విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఏలూరు జిల్లా పెదనిండ్రకొలను జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. 2026 ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులను విజయవాడ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకెళ్లారు. వారిలో పలువురికి ఇదే తొలి విమాన ప్రయాణం కావడం విశేషం.
ఎస్‌ఎస్‌సీలో తెలుగులో 100కు 100 మార్కులు సాధించిన ఎనిమిది మంది, సోషల్ సైన్స్‌లో పూర్తి మార్కులు సాధించిన ఇద్దరితో పాటు జిల్లా టాపర్‌గా 591 మార్కులు సాధించిన సారెళ్ల కీర్తనను పర్యటనకు ఎంపిక చేశారు. పాఠశాల మాక్ అసెంబ్లీలో స్పోర్ట్స్ మంత్రిగా ప్రతిభ చూపిన గంధం గురునాగ శివప్రసాద్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థులను కూడా ఎంపిక చేశారు.
హైదరాబాద్ చేరుకున్న అనంతరం విద్యార్థులను ప్రత్యేక బస్సులో నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. ట్యాంక్‌బండ్, నెహ్రూ జూలాజికల్ పార్క్, సాలార్‌జంగ్ మ్యూజియం, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్, హైదరాబాద్ మెట్రో రైలు, అసెంబ్లీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, బుద్ధ విగ్రహాన్ని సందర్శించారు.
చదువులో మరింత రాణించేందుకు విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు తరగతి గది బయట ప్రపంచాన్ని పరిచయం చేయడమే కార్యక్రమం ఉద్దేశమని ఉపాధ్యాయులు తెలిపారు. తొలి విమాన ప్రయాణం, హైదరాబాద్ పర్యటన తమకు జీవితంలో మరచిపోలేని అనుభూతిగా నిలిచిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

