📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎస్‌ఐఆర్‌ చివరి అంకం.. లెక్క తేలాల్సిందే!

ఎస్‌ఐఆర్‌ చివరి అంకం.. లెక్క తేలాల్సిందే!

3.38 కోట్ల ఫారాలు.. ఇంకా 73.96 లక్షలు పెండింగ్‌.. ఎవరి బాధ్యత ఎంత?

హైదరాబాద్‌, ఆగస్టు 10 (నవజ్యోతి ప్రతినిధి):

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో కీలక దశకు నేటితో గడువు ముగియనుంది. ఆగస్టు 9 సాయంత్రం 6 గంటల వరకు నమోదైన లెక్కల ప్రకారం ఓటర్లకు ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయింది. అయితే డిజిటలైజేషన్‌ 78.14 శాతానికే చేరింది. ఇంకా 73,95,954 ఫారాలు డిజిటలైజ్‌ కావాల్సి ఉంది.

3.38 కోట్ల ఫారాలు.. 2.64 కోట్ల డిజిటలైజేషన్‌

రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు ఫారాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 2,64,30,494 ఫారాలు డిజిటలైజ్‌ అయ్యాయి. 78.14 శాతం పూర్తికాగా.. 21.86 శాతం పెండింగ్‌లో ఉంది. చివరి రోజున ఈ పెండింగ్‌ ఫారాలను పూర్తి చేయడం అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది.

హైదరాబాద్‌లోనే 19.61 లక్షలు పెండింగ్‌

హైదరాబాద్‌లో 47,36,669 ఫారాలు పంపిణీ చేయగా 27,74,687 మాత్రమే డిజిటలైజ్‌ అయ్యాయి. ఇంకా 19,61,982 ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి. డిజిటలైజేషన్‌ 58.58 శాతంగా నమోదైంది. మెద్చల్‌ మల్కాజిగిరిలో 10,77,802, రంగారెడ్డిలో 12,98,353 ఫారాలు ఇంకా డిజిటలైజ్‌ కావాల్సి ఉంది.

ఈ మూడు జిల్లాల్లోనే 43.38 లక్షలు

హైదరాబాద్‌, మెద్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి 43,38,137 ఫారాలు ఇంకా డిజిటలైజేషన్‌ పూర్తి కావాల్సి ఉంది. రాష్ట్ర పెండింగ్‌లో వీటి వాటా గణనీయంగా ఉంది.

కొన్ని జిల్లాల్లో 90 శాతానికి పైగా

యాదాద్రి భువనగిరి 94.30 శాతంతో ముందంజలో ఉంది. జంగావ్‌ 91.69, మెదక్‌ 90.54, సూర్యాపేట 90.43, మహబూబాబాద్‌ 90.07 శాతం డిజిటలైజేషన్‌ పూర్తి చేశాయి. కామారెడ్డిలో 87.86, నిజామాబాద్‌లో 85.22, కరీంనగర్‌లో 83.54, జగిత్యాలలో 89.60 శాతం నమోదైంది.

బీఎల్‌ఓలతో పాటు ఓటర్లూ అప్రమత్తం

ఫారం పంపిణీతో బీఎల్‌ఓల బాధ్యత ముగియదు. ఫారం సక్రమంగా నమోదైందా? డిజిటలైజేషన్‌ పూర్తయిందా? అన్నది పరిశీలించాలి. ఓటర్లు కూడా తమ వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో చూసుకోవాలి. తప్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.

చివరి రోజు.. అసలు పరీక్ష

డిజిటలైజేషన్‌ ఇంకా 78.14 శాతమే ఉండటంతో చివరి రోజు పనిని వేగవంతం చేయాల్సి ఉంది. అయితే తొందరపాటుతో తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి బీఎల్‌ఓ తన పరిధిలోని పెండింగ్‌ ఫారాలను, అధికారులు జిల్లాల వారీ పురోగతిని సమీక్షించాలి.

లెక్క తేలాల్సింది కేవలం డిజిటలైజేషన్‌ శాతం కాదు.. ఒక్క అర్హుడి ఓటు కూడా ప్రక్రియలో మిగిలిపోకుండా చూసామా లేదా అన్నదే అసలు లెక్క.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!