📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుబేరుడైనా ఉపాధి హామీ కూలీ కావాల్సిందే.. ఉచిత పథకాలపై హైకోర్టు ఆందోళన!

కుబేరుడైనా ఉపాధి హామీ కూలీ కావాల్సిందే.. ఉచిత పథకాలపై హైకోర్టు ఆందోళన!

కోటీశ్వరులకు రైతుబంధు ఎందుకని ప్రశ్న.. సంక్షేమ వ్యయంపై తీవ్ర వ్యాఖ్యలు…

హైదరాబాద్, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): ఉచిత పథకాలను పరిమితులు లేకుండా కొనసాగిస్తే చివరికి కుబేరుడైనా ఉపాధి హామీ కూలీగా మారాల్సిన పరిస్థితి వస్తుందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. కోటీశ్వరులకు కూడా రైతుబంధు వంటి పథకాల ప్రయోజనాలు అందించడంపై కోర్టు ప్రశ్నించింది. సంక్షేమ పథకాలపై పెరుగుతున్న వ్యయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్‌ నాగేశ్‌ భీమపాక శుక్రవారం కంటోన్మెంట్‌ బోర్డు సభ్యుడు జె. రామకృష్ణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

కంటోన్మెంట్‌ బోర్డుకు చెల్లించాల్సిన రూ.33.42 కోట్ల బకాయిలపై 2024లో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా మొత్తం చెల్లించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణకు హాజరైన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా.. మేలో రూ.24 కోట్లు విడుదల చేశామని, మిగిలిన రూ.9.42 కోట్లను ఆరు నెలల్లో విడతలవారీగా చెల్లిస్తామని తెలిపారు.

సంక్షేమ పథకాలపై కోర్టు ఆందోళన

జీతాలు, అప్పుల చెల్లింపుల తర్వాత రాష్ట్ర బడ్జెట్‌లో గణనీయమైన భాగం సంక్షేమ పథకాలకే వెళ్తోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. మోటార్‌సైకిళ్లు, ఐఫోన్లు ఉన్నవారు సైతం ఉచిత బియ్యం పొందుతున్నారని, అనర్హులైన తెల్ల రేషన్‌ కార్డులను రాజకీయ కారణాలతో తొలగించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. కోటీశ్వరులకు రైతుబంధు వంటి పథకాల ప్రయోజనం ఎందుకని ప్రశ్నించారు.

ప్రభుత్వ భూముల విక్రయంపైనా ప్రశ్నలు

అప్పులు తీర్చేందుకు ప్రభుత్వ భూములను విక్రయిస్తున్న పరిస్థితిపై కూడా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్‌ తరాలకు ఏమి మిగులుతుందని ప్రశ్నించింది. ప్రస్తుత స్థాయిలో సంక్షేమ వ్యయం దీర్ఘకాలంలో కొనసాగడం కష్టమని, పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని పేర్కొంది.

రూ.9.42 కోట్ల బకాయిలపై అఫిడవిట్‌

ప్రభుత్వం ఇచ్చిన వివరాలను నమోదు చేసుకున్న హైకోర్టు.. మిగిలిన రూ.9.42 కోట్ల చెల్లింపుల షెడ్యూల్‌పై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 19కు వాయిదా వేసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!