📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మురుగు ప్రవాహంలో సూరారం... చూస్తూ ఊరుకుంటున్న వ్యవస్థ!

మురుగు ప్రవాహంలో సూరారం… చూస్తూ ఊరుకుంటున్న వ్యవస్థ!

ఏళ్ల సమస్యకు తాత్కాలిక మరమ్మతులే.. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన డ్రైనేజీ..

 

 

కుత్బుల్లాపూర్, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి): అభివృద్ధి, పారిశుద్ధ్యం, స్మార్ట్ సిటీ పేరుతో పెద్ద ఎత్తున ప్రకటనలు వినిపిస్తున్నా.. కొంపల్లి సర్కిల్ పరిధిలోని సాయిబాబానగర్ డివిజన్ సూరారం కాలనీలో మాత్రం డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. ఓం జెండా మార్కెట్ రహదారి, గార్డెన్ కేఫ్ సమీపంలో గత వారం రోజులుగా మురుగు నీరు రోడ్లపైకి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో స్థానికులు, వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిత్యం వందలాది మంది కొనుగోలుదారులతో రద్దీగా ఉండే ఓం జెండా మార్కెట్ ప్రాంతంలో రోడ్డంతా మురుగు నీరు చేరడంతో ప్రజలు మురుగు ప్రవాహం మధ్యనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతుండగా, ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం నెలకొంది.

గార్డెన్ కేఫ్ పక్కనున్న గల్లీలో కూడా డ్రైనేజీ నీరు నిరంతరం రోడ్డుపై పారుతుండటంతో దుర్వాసన వ్యాపిస్తోంది. దోమల బెడద పెరగడంతో డెంగ్యూ, చికున్‌గున్యా వంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని చెబుతున్నారు.

ఈ సమస్య కొత్తది కాదని, ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. డ్రైనేజీ పైపుల సామర్థ్యం తగ్గిపోవడం, పెరిగిన జనాభాకు అనుగుణంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను విస్తరించకపోవడమే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. అధికారులు అప్పుడప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేసి వెళ్లిపోతున్నారని, కానీ సమస్య మళ్లీ యథాతథంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పాత అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లైన్లను పూర్తిగా పునర్నిర్మించి ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే సూరారం డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!