నకిలీ పనీర్‌పై మహారాష్ట్ర సర్కార్ కొరడా.. ఏడాది నిషేధం
ముంబై, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి): పాలు లేకుండానే పనీర్.. పామాయిల్‌తోనే తయారీ..! వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ పనీర్ తయారీదారులపై మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. పామాయిల్, వెజిటబుల్ ఫ్యాట్, స్టార్చ్ తదితర పదార్థాలతో తయారు చేస్తున్న అనలాగ్ (నాన్-డెయిరీ) పనీర్ తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు నిషేధం విధించింది.
ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, పాలతో తయారయ్యే అసలు పనీర్‌కు బదులుగా పామాయిల్, వెజిటబుల్ ఆయిల్, ఇతర రసాయన పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను పనీర్ పేరుతో విక్రయించడం వినియోగదారులను మోసం చేయడమే కాకుండా ప్రజారోగ్యానికి ప్రమాదంగా మారుతోందని పేర్కొంది. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 కింద ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఆహార భద్రత నిపుణుల ప్రకారం, అసలు పనీర్ పూర్తిగా పాలతో తయారవుతుంది. అయితే అనలాగ్ పనీర్‌లో పామాయిల్, వెజిటబుల్ ఫ్యాట్, స్టార్చ్, ఎమల్సిఫైయర్లు వంటి పదార్థాలను కలిపి తక్కువ ఖర్చుతో తయారు చేసి మార్కెట్లో పనీర్ పేరుతో విక్రయిస్తున్నారు. ఈ ఉత్పత్తులను చాలామంది వినియోగదారులు అసలు పనీర్‌గా భావించి కొనుగోలు చేస్తున్నారని అధికారులు తెలిపారు.
నిషేధాన్ని ఉల్లంఘించి నకిలీ పనీర్ తయారీ, విక్రయాలు, నిల్వ లేదా రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. నేరం రుజువైతే ఆరు నెలల వరకు జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ఇటీవల దేశవ్యాప్తంగా ఆహార కల్తీ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మసాలా దినుసులు, నెయ్యి, నూనెలు, స్వీట్లు, పాల ఉత్పత్తుల్లో కల్తీ ఘటనలు వెలుగుచూస్తుండగా, ఇప్పుడు పనీర్ పేరుతో పామాయిల్ విక్రయాలపై నిషేధం విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి నకిలీ ఆహార ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు. వినియోగదారులు పనీర్ కొనుగోలు చేసే సమయంలో నాణ్యత, లేబుల్, తయారీ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆహార భద్రత నిపుణులు సూచిస్తున్నారు.

