విధి నిర్వహణకు వెళ్తుండగా అకస్మాత్తుగా తీవ్ర ఛాతినొప్పికి గురైన ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.మెదక్ జిల్లా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లోని క్యూఆర్టీలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఆనందం (54) మంగళవారం చెక్‌పోస్ట్ విధుల నిమిత్తం తూప్రాన్‌కు వెళ్లారు. అక్కడికి చేరుకోగానే ఆయనకు ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి వచ్చింది.
వైద్యుల ప్రయత్నం ఫలించలేదు
ఛాతినొప్పి రావడంతో ఆనందం వెంటనే తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఈసీజీ నిర్వహిస్తుండగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది వెంటనే సీపీఆర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మేడ్చల్‌లోని మెడినోవా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.
సహచరుల కన్నీటి పర్యంతం
ఆనందం అందరితో కలిసిమెలిసి, సరదాగా ఉంటూ సహచరులతో ఆత్మీయంగా మెలిగేవారని తోటి సిబ్బంది గుర్తుచేసుకున్నారు. విధుల్లో చురుగ్గా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే మంచి వ్యక్తిని కోల్పోయామని వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకుంటూ పలువురు సహచరులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఎస్పీ తీవ్ర దిగ్భ్రాంతి
హెడ్ కానిస్టేబుల్ ఆనందం ఆకస్మిక మృతిపై జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పోలీసు శాఖకు ఆనందం అందించిన నిస్వార్థ సేవలను ఈ సందర్భంగా ఎస్పీ కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
ఆనందం అంత్యక్రియలను బుధవారం ఉదయం 10 గంటలకు సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామంలో పోలీసు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.

