కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 1 (నవజ్యోతి ప్రతినిధి):




జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని ఎస్వీ కో-ఆపరేటివ్ పరిధిలో బహిరంగ ప్రదేశంలో పడేసిన కెమికల్ వ్యర్థాలపై నవజ్యోతి ప్రచురించిన వరుస కథనాలకు అధికారులు స్పందించారు. ‘కెమికల్ వ్యర్థాలపై 21 రోజులుగా అదే నిర్లక్ష్యం’ అంటూ సమస్యను వెలుగులోకి తీసుకురావడంతో పీసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి, అక్కడి వ్యర్థాలను సురక్షితంగా రాంకీకి తరలించారు.
విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో 21 రోజులుగా కెమికల్ వ్యర్థాలు పేరుకుపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. నవజ్యోతి వరుస కథనాలతో విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వ్యర్థాలను తొలగించారు.
అక్రమ డంపింగ్‌పై కఠిన చర్యలు
బహిరంగ ప్రదేశాల్లో కెమికల్ వ్యర్థాలను పడేసినట్లు గుర్తిస్తే సంబంధిత కంపెనీలతో పాటు ఖాళీ స్థలాల్లో అక్రమంగా డంపింగ్ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పీసీబీ అధికారులు హెచ్చరించారు.
వ్యర్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
వ్యర్థాలను తొలగించడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాదని స్థానికులు అంటున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు డంపింగ్ చేశారు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని కోరుతున్నారు.
పునరావృతం కాకుండా నిఘా అవసరం
భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పీసీబీ, సంబంధిత శాఖలు నిరంతరం నిఘా పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నవజ్యోతి కథనాలకు స్పందన.. 21 రోజులుగా బహిరంగ ప్రదేశంలో ఉన్న కెమికల్ వ్యర్థాల తొలగింపు. రాంకీకి సురక్షిత తరలింపు. ఇక అక్రమ డంపింగ్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్.

