📄 ePaper
Saturday, August 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమీక్ష రైతులకు నేరుగా యాంత్రీకరణ సబ్సిడీ!

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమీక్ష రైతులకు నేరుగా యాంత్రీకరణ సబ్సిడీ!

పనిముట్లు ఖరారు.. యూరియా సమస్యలు అదే రోజే పరిష్కరించాలి

హైదరాబాద్, ఆగస్టు 28 (నవజ్యోతి ప్రతినిధి):
రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేయడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించే
లక్ష్యంతో అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో కీలక నిర్ణయాలు
తీసుకున్నారు. ఈ పథకం కింద అందించే వ్యవసాయ పనిముట్లను ఖరారు చేసినట్లు
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఈసారి సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా
చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, సహకార శాఖల పరిధిలోని పలు అంశాలపై
ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ యాంత్రీకరణ,
ఎరువుల లభ్యత, యూరియా సరఫరా, ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణ, రైతు వేదికలపై
సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు,
ఆదేశాలు జారీ చేశారు.

యాంత్రీకరణ పథకంలో పనిముట్లు ఖరారు

రైతుల అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద పంపిణీ చేయనున్న
పనిముట్లను ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. పంపిణీ ప్రక్రియను
వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈసారి లబ్ధిదారులకు అందించే సబ్సిడీ నిధులను నేరుగా రైతుల
బ్యాంకు ఖాతాల్లో జమ
చేసే విధంగా వ్యవస్థను రూపొందించాలని
సూచించారు. మధ్యవర్తులకు అవకాశం లేకుండా పారదర్శకంగా పథకం అమలు
చేయాలని స్పష్టం చేశారు.

వ్యవసాయ పనిముట్లు సరఫరా చేసే సంస్థల ఎంప్యానెల్‌మెంట్‌ జాబితాను
హాకా అధికారులు పరిశీలిస్తున్నారని మంత్రి తెలిపారు. నాణ్యత, ధర,
రైతులకు అందుబాటు వంటి అంశాలను పరిశీలించి జాబితాను త్వరగా
ఖరారు చేయాలని ఆదేశించారు.

యూరియా సరఫరాలో ఇబ్బందులు లేవు

రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి
తుమ్మల స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్‌ యాప్‌లో
మ్యాపింగ్‌ తదితర సమస్యలు తలెత్తితే వాటిని కేంద్ర అధికారులతో
మాట్లాడి అదే రోజున పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని
వ్యవసాయశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.

2.79
యూరియా
0.33
డీఏపీ
2.25
కాంప్లెక్స్
0.31
ఎంఓపీ
0.20
ఎస్‌ఎస్‌పీ

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఎరువులు — లక్షల మెట్రిక్‌ టన్నుల్లో

ఆగస్టు సరఫరా ప్రణాళికలో భాగంగా 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాకు
గాను ఇప్పటివరకు 1.17 లక్షల మెట్రిక్‌ టన్నులను రాష్ట్రానికి
తెప్పించినట్లు మంత్రి వివరించారు.

రాష్ట్ర యూరియా యాప్‌ ద్వారా 33.37 లక్షల మంది రైతులు
1.38 కోట్ల యూరియా సంచులను బుక్‌
చేసుకోగా, 1.24 కోట్ల
సంచులను కొనుగోలు చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌
యాప్‌ ద్వారా 10.17 లక్షల మంది రైతులు 42.34 లక్షల సంచులను బుక్‌
చేసుకుని, 28.39 లక్షల సంచులను కొనుగోలు చేసినట్లు చెప్పారు.

కేంద్ర ఫెర్టిలైజర్‌ యాప్‌పై రైతులకు అవగాహన

కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్‌ యాప్‌ వినియోగంపై రైతులకు విస్తృతంగా
అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. యాప్‌లో బుకింగ్‌, ఎరువుల
లభ్యత, కొనుగోలు విధానం తదితర అంశాలపై రైతులకు స్పష్టమైన సమాచారం
అందించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు.

అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ పరిస్థితుల ప్రభావంతో సరఫరా వ్యవస్థపై
ఒత్తిడి ఉన్నప్పటికీ రాష్ట్రానికి అవసరమైన ఎరువులు అందేలా ప్రభుత్వం
కేంద్రంతో సమన్వయం చేస్తోందని మంత్రి తెలిపారు. పోర్టులకు చేరిన
యూరియాను ఆలస్యం లేకుండా జిల్లాలకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు
తీసుకున్నట్లు వివరించారు.

కాంప్లెక్స్‌ ఎరువులకూ సబ్సిడీ ఇవ్వాలి

యూరియాతో పాటు కాంప్లెక్స్‌ ఎరువులకు కూడా కేంద్ర ప్రభుత్వం తగిన
సబ్సిడీ ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరారు. సబ్సిడీ విధానం సమతుల్యంగా
లేకపోవడం వల్ల రైతులు తక్కువ ధరలో లభించే యూరియాను అధికంగా
వినియోగించే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.

“యూరియా పంటలను రక్షించే ఎరువు కాదు.. భక్షించే ఎరువు” అని వ్యాఖ్యానించిన
మంత్రి, నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా
అందించే విధంగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగుకు మరింత ఊపు

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణను మరింత వేగవంతం చేయాలని మంత్రి
ఆదేశించారు. రైతుల నుంచి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో మొక్కల
లభ్యతను పెంచి, దరఖాస్తు చేసుకున్న రైతులకు రెండు మూడు
రోజుల్లోనే మొక్కలు
అందేలా సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేయాలని
సూచించారు.

ఏ జిల్లాలో డిమాండ్‌ ఎక్కువగా ఉంటే అక్కడికి మొదటి ప్రాధాన్యంతో
మొక్కలు సరఫరా చేయాలని కలెక్టర్లతో సమన్వయం చేయాలని ఆదేశించారు.
నర్సరీల్లో నిర్ణయించిన లక్ష్యానికి కనీసం రెండింతల సంఖ్యలో
మొక్కలు
సిద్ధంగా ఉంచాలని సూచించారు.

ఆయిల్‌పామ్‌లో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు డ్రిప్‌
ఇరిగేషన్‌ కీలకమని మంత్రి పేర్కొన్నారు. డ్రిప్‌ కంపెనీలతో చర్చించి
రైతులకు త్వరగా వ్యవస్థలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని
ఆయిల్‌ఫెడ్‌ ఎండీని ఆదేశించారు. ఆయిల్‌పామ్‌ మిల్లుల నిర్మాణాలను
కూడా వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

2,600 రైతు వేదికలపై సోలార్‌ ప్యానెల్స్‌

2,600
రైతు వేదికలు
సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుకు లక్ష్యం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,600 రైతు వేదికలపై సోలార్‌ ప్యానెల్స్‌
ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. దశలవారీగా కార్యాచరణ రూపొందించి
రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు.

హాకా, రెడ్కో అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన సాంకేతిక,
ఆర్థిక అంశాలను పరిశీలించి త్వరగా పనులు చేపట్టాలని హాకా ఎండీని
ఆదేశించారు. ఈ అంశంపై రెడ్కో కమిషనర్‌తో మంత్రి ఫోన్‌లో మాట్లాడి
కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

సమీక్షలో పాల్గొన్నవారు:
వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి,
కోఆపరేషన్‌ స్పెషల్‌ కమిషనర్‌ రాహుల్‌ రాజ్, హార్టికల్చర్‌ డైరెక్టర్‌
యాస్మిన్‌ భాషా, హాకా ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!