సిడ్నీ, ఆగస్టు 27 (నవజ్యోతి ప్రతినిధి):
సాధారణంగా బొద్దింక కనిపిస్తే చాలామంది భయపడతారు. కానీ భవిష్యత్తులో అదే
బొద్దింకలు ప్రాణాలను కాపాడే ‘మెడికల్ రెస్క్యూ టీమ్’గా మారే అవకాశం
కనిపిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు చిన్నపాటి వైద్య పరికరాలు,
కెమెరాలు అమర్చిన ‘సైబోర్గ్ బొద్దింకలను’ అభివృద్ధి చేశారు.
భూకంపాలు, భవనాలు కూలిపోవడం వంటి విపత్తుల్లో శిథిలాల మధ్య చిక్కుకున్న
బాధితుల వద్దకు మనుషులు చేరుకోలేని పరిస్థితుల్లో.. ఈ బొద్దింకల ద్వారా
అత్యవసర మందులను చేరవేసేలా ప్రయోగాలు చేస్తున్నారు. ఈ పరిశోధనకు
యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్
శాస్త్రవేత్తలు నేతృత్వం వహించారు.
‘పారాబోర్గ్స్’.. బొద్దింకలకు బ్యాక్‌ప్యాక్
పరిశోధకులు ఉత్తర క్వీన్స్‌లాండ్‌లో కనిపించే జెయింట్ బరోయింగ్
కాక్రోచ్‌లను ఉపయోగించారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత బరువైన
బొద్దింక జాతుల్లో ఒకటి. సుమారు 8.5 సెంటీమీటర్ల వరకు
పెరిగే ఈ కీటకాలపై చిన్న బ్యాక్‌ప్యాక్ తరహా పరికరాలను అమర్చారు.
ఆ పరికరాల్లో మందులను పంపించే సిరంజ్ సిలిండర్లు, కెమెరాలు ఉంటాయి.
బొద్దింక నాడీ వ్యవస్థలో ప్రత్యేక ఎలక్ట్రోడ్లను అమర్చి స్వల్ప విద్యుత్
సంకేతాల ద్వారా దాని కదలికలను నియంత్రించే విధానాన్ని అభివృద్ధి చేశారు.
ప్రయోగాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి?
95% వరకు విజయం
రోబోల కంటే బొద్దింకలే ఎందుకు?
శిథిలాలు, ఇరుకైన ప్రదేశాలు, గుహలు వంటి ప్రాంతాల్లో కదలడానికి బొద్దింకల
శరీర నిర్మాణం అనుకూలంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వాటి
చురుకుదనం, స్థితిస్థాపకత, తక్కువ విద్యుత్ అవసరం వంటి
లక్షణాలు చిన్న రోబోట్లతో పోలిస్తే ప్రత్యేక ప్రయోజనంగా ఉంటాయని
పేర్కొన్నారు.
ప్రయోగంలో ఒక బొద్దింకకు కెమెరా అమర్చి ‘పరిశీలకుడు’గా ఉపయోగించారు.
మరో బొద్దింకకు మందులు పంపించే పరికరాన్ని అమర్చి, అవసరమైన సమయంలో
దాన్ని యాక్టివేట్ చేశారు.
పాము కాటుకూ.. అలర్జీకి కూడా?
భవిష్యత్తులో శిథిలాల్లో చిక్కుకున్న బాధితులకు రెస్క్యూ సిబ్బంది చేరుకునే
లోపే అత్యవసర చికిత్స అందించేందుకు ఈ సాంకేతికతను ఉపయోగించాలని
పరిశోధకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పాము కాటు, తీవ్రమైన
అలర్జీ వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక మందులను బాధితుడి
వద్దకు చేర్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
ఇంకా చాలా సవాళ్లు ఉన్నాయి
ఈ ప్రయోగాలు ప్రస్తుతం నియంత్రిత ప్రయోగశాల వాతావరణంలోనే జరిగాయి.
సిలికాన్ లక్ష్యాలు, పంది చర్మంపై మందుల పంపిణీ పరీక్షించారు. నిజమైన
విపత్తు ప్రాంతాల్లో మాత్రం భూభాగం సంక్లిష్టత, సిగ్నల్ అందకపోవడం,
శిథిలాల మధ్య నియంత్రణ కోల్పోవడం, ఇంజెక్షన్ భద్రత వంటి సమస్యలను
పరిష్కరించాల్సి ఉంది.
పరిశోధకుల తదుపరి లక్ష్యం ఒక్క బొద్దింకతో కాకుండా.. ఒకేసారి
బొద్దింకల గుంపును శిథిలాల్లోకి పంపించి బాధితులను
వేగంగా గుర్తించి సహాయం అందించే వ్యవస్థను అభివృద్ధి చేయడం.
భయపెట్టే బొద్దింక.. ఇక ప్రాణదాతగా!
ఇప్పటివరకు విపత్తుల తర్వాత బాధితులను గుర్తించేందుకు సైబోర్గ్ కీటకాల
వినియోగంపై పరిశోధనలు జరిగినా.. బాధితుల వద్దకు వెళ్లి వైద్య సహాయం
అందించే దిశగా ఈ ప్రయోగం మరో అడుగుగా పరిశోధకులు చెబుతున్నారు.
ప్రయోగశాల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, మనుషులపై వాస్తవ
రెస్క్యూ పరిస్థితుల్లో ఉపయోగించే స్థాయికి చేరాలంటే మరింత పరిశోధన
అవసరం.

