చిన్నోడు తీసిన టోకెన్.. అదే కుటుంబానికి సొంతింటి అదృష్టం!
హైదరాబాద్, ఆగస్టు 28 (నవజ్యోతి ప్రతినిధి):
హైదరాబాద్ మహానగర పరిధిలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన
ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.
అర్హతే ప్రామాణికంగా, కులమతాలు, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
క్యూర్ పరిధిలో తొలి విడతగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపునకు
అత్యంత పారదర్శకంగా లక్కీడ్రా నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. మీడియా,
అర్హులైన లబ్ధిదారుల సమక్షంలో డ్రా నిర్వహించడంతో పాటు ప్రక్రియను సామాజిక
మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు.
16 నియోజకవర్గాలు.. సుమారు 8 వేల ఫ్లాట్లు
ఆగస్టు 28 నుంచి 31 వరకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 8 వేల
ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. రోజుకు
నాలుగు నియోజకవర్గాల చొప్పున ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.
ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్లకు 600 మంది లబ్ధిదారులను
డ్రా ద్వారా ఎంపిక చేస్తామని మంత్రి వివరించారు. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో
తుది పరిశీలన చేస్తారు. ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే మిగిలిన
120 మందిలో అర్హులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.
🔹 తొలి విడత – 16 నియోజకవర్గాలు
🔹 ఫ్లాట్లు – సుమారు 8,000
🔹 ఒక్కో నియోజకవర్గంలో – 480 ఫ్లాట్లు
🔹 డ్రా ద్వారా ఎంపిక – 600 మంది
🔹 ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం – సుమారు 525 చదరపు అడుగులు
🔹 అన్‌డివైడెడ్ భూమి వాటా – 17 నుంచి 20 గజాలు
🔹 లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ – ఉచితం
రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్
ఇందిరమ్మ టవర్స్‌లో ఇల్లు పొందిన అర్హులైన లబ్ధిదారులకు
ఒక్క పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మంత్రి
తెలిపారు. రిజిస్ట్రేషన్ అనంతరం పదేళ్ల తర్వాత అవసరాన్ని బట్టి ఇంటిని
విక్రయించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతకుముందు అత్యవసర పరిస్థితి
ఏర్పడితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను బ్యాంకులో కుదువ పెట్టి రుణం పొందే
అవకాశం కూడా ఉంటుందని వివరించారు.
అవసరాన్ని బట్టి ప్రభుత్వం గుర్తించిన స్థలాల్లో 10 అంతస్తుల వరకు
ఇందిరమ్మ టవర్స్ నిర్మించి, లిఫ్ట్‌లు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని
పొంగులేటి తెలిపారు. లక్కీడ్రా అనంతరం అధికారుల తుది పరిశీలన పూర్తయిన తర్వాత
సర్టిఫికెట్లు అందజేస్తామని, ఆపై 3–4 రోజుల్లోనే నిర్మాణ పనులు
ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చిన్నోడు తీసిన టోకెన్.. అదే కుటుంబానికి ఇల్లు!
ఇదిలా ఉండగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్దేవుపల్లి పరిధిలోని
లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.
లక్కీడ్రా టోకెన్‌ను ఒక చిన్నారితో తీయించగా.. అనూహ్యంగా ఆ టోకెన్
అదే చిన్నారి కుటుంబానికి చెందిన జరపుల లక్ష్మీ పేరుపై వచ్చింది.
పేదల సొంతింటి కలను తీర్చాలనే ప్రభుత్వ సంకల్పానికి దేవుడి ఆశీస్సులు
తోడైనట్టుగా ఈ ఘటన నిలిచిందని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
చిన్నారులు స్వచ్ఛమైన మనసుతో ఉంటారని, చిన్న పిల్లలు దేవుళ్లతో
సమానం అనే భావనకు ఈ ఘటన మరింత ప్రత్యేకతను తీసుకొచ్చిందన్నారు.
లక్కీడ్రాలో వందలాది మంది పేర్ల మధ్య నుంచి చిన్నారి చేతిలోకి వచ్చిన
టోకెన్ అదే కుటుంబానికి దక్కడం అక్కడున్న వారిని ఆనందానికి, ఆశ్చర్యానికి
గురిచేసింది. ఒక చిన్నారి చేతిలోని ఒక్క టోకెన్.. ఓ పేద కుటుంబం
జీవితంలో సొంతింటి కలను నిజం చేసే అవకాశంగా మారింది.
దేవుడి ఆశీర్వాదం, ప్రభుత్వ సహకారంతో జరపుల లక్ష్మీ కుటుంబం సొంతింటి
కల నెరవేరుతున్నందుకు ఆమె కుటుంబం జీవితాంతం సంతోషంగా, చల్లగా జీవించాలని
మనసారా ఆశీర్వదించినట్లు తెలిపారు. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా
జరుగుతాయని, ఇందిరమ్మ టవర్స్ కార్యక్రమంలో ఈ ఘటన ప్రత్యేక ఆకర్షణగా
నిలిచిందన్నారు.
సామాజిక న్యాయానికి రిజర్వేషన్లు
ఫ్లాట్ల కేటాయింపులో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 16 శాతం,
దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు చెప్పారు.
పారిశుధ్య కార్మికులు, నాలుగో తరగతి ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు
10 శాతం చొప్పున రిజర్వేషన్ ఉంటుందని వివరించారు.
మొత్తంగా ఫ్లాట్లలో 50 శాతం రిజర్వేషన్లు ఉండగా,
మహిళలకు 30 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు వేగం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా
4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని పొంగులేటి తెలిపారు.
ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు.
ప్రతి ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నాలుగు విడతల్లో అందిస్తున్నామని,
చివరి విడత బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయని వివరించారు.
రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల
ఎంపికను వేగవంతం చేస్తున్నామని, మరో పది రోజుల్లో ఈ ప్రక్రియ కూడా పూర్తయ్యే
అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వానికి డబ్బు కూడబెట్టుకోవడం కంటే పేద కుటుంబాలకు సొంతింటిని అందించి
ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించడమే ముఖ్యమని పొంగులేటి అన్నారు.
ఖరీదైన ప్రాంతాల్లోనూ పేద కుటుంబాలు గౌరవంగా జీవించాలన్నదే ఇందిరమ్మ టవర్స్
లక్ష్యమని స్పష్టం చేశారు.

