ప్రజల సమస్యలను స్థానికంగానే తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. సోమవారం 565 మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించగా.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనూ కార్యక్రమం చేపట్టారు. దీంతో మొత్తం 566 ప్రాంతాల్లో ప్రజావాణి నిర్వహించినట్లు రాష్ట్ర ప్రజావాణి ఇన్చార్జి డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ తెలిపారు.
5,410 వినతులు.. 10,753 మంది అధికారులు
ప్రజల నుంచి మొత్తం 5,410 వినతులు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజలు అధికారులకు నేరుగా వివరించారు. వినతులను పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించేలా చర్యలు చేపట్టారు.
వినతుల్లో కరీంనగర్ టాప్
జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ అత్యధికంగా 704 వినతులతో మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాకు సగటున 164 వినతులు అందగా.. ఒక్కో మండలానికి సగటు వినతుల సంఖ్యలోనూ కరీంనగర్ ముందంజలో ఉంది.
స్థానికంగానే సమస్యలకు పరిష్కారం
ప్రతి సమస్య కోసం జిల్లా, రాష్ట్ర కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే సంబంధిత అధికారులను కలిసే అవకాశం ప్రజావాణి ద్వారా కల్పించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు వివరించి వినతులు సమర్పించారు.
ప్రజలకు చేరువగా పాలన
పెద్ద సంఖ్యలో ప్రజలు నేరుగా అధికారులను కలిసి సమస్యలను వివరించడంతో కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని అధికారులు తెలిపారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని పరిష్కరించడమే మండల స్థాయి ప్రజావాణి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
566 మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు..
5,410 వినతులు.. 10,753 మంది అధికారులు..
ప్రజల సమస్యలకు స్థానికంగానే పరిష్కారం దిశగా అడుగు!

